-->

అన్నమాచార్య

అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 91408 - ఫిబ్రవరి 231503తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు(సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. 
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్యక్షేత్రయ్యరామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.
చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందాఅంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.
తాళ్ళపాక అన్నమాచార్యులు. గొప్ప సంకీర్తనాచార్యులు. తెలుగు నేలను తన సంకీర్తనల సాగరంలో స్నానమాడించినవాడు. సాక్షాత్తూ కలియుగ వేంకటేశ్వరుడే అన్నమాచార్యుల గానాన్ని విని పులకించిపోయేవాడంటే అతిశయోక్తి కాదు. సంకీర్తనల చరిత్రలో తెలుగు జాతికి ఖ్యాతిని తెచ్చినవాడు అన్నమయ్య.

తల్లిదండ్రులు
సుమారు ఆరు వందల ఏళ్ళ క్రితం నాటి చరిత్ర ఇది. కడప జిల్లా రాజంపేట తాలూకాలో తాళ్ళపాక అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నారాయణసూరి అనే గొప్ప కవి, పండితుడు ఉండేవాడు. ఇతని ఇల్లాలు లక్కమాంబ. మహాభక్తురాలు. చక్కగా పాడుతుంది. ఈమె స్వగ్రామమైన మాడుపూరులోని చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడే వాడట. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడూ లేడు. ఒక మంచి కొడుకును ప్రసాదించమని ఏడుకొండల స్వామికి మ్రొక్కుకున్నారు.
ఒక మంచిరోజున శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుపతికి ప్రయాణమయ్యారు. తిరుపతి చేరి మందిరంలో స్వామి ముందు మోకరి ల్లారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లయ్యింది. కళ్ళు మిరమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి అదృశ్యమైంది. వేంకటేశ్వ రుడు తన ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించి అదృశ్యమయ్యాడు. పరమానందభరితులైన ఆ దంపతులు వేంకటేశ్వరుని స్తుతిస్తూ తాళ్ళపాక చేరుకున్నారు.
జననం – బాల్యం
లక్కమాంబ గర్భవతి అయ్యింది. క్రీ.శ. 1408 వ సంవత్సరంలో వైశాఖ పౌర్ణమిన ఒక మగ శిశువు జన్మించగా అన్నమయ్య అని నామకరణం చేసారు. అన్నమయ్య బోసి నవ్వులతో అందరినీ అలరించే వాడు. వెంకన్న పేరు చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. స్వామికి జోల పాడితేనే కాని నిద్రపోడు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతూంటే ఏదో అర్థమైనట్లు తల పంకించేవాడు. తండ్రి కావ్యాల అర్థాలు వివరిస్తూంటే తానూ ‘ఊ’ కొట్టేవాడు.
అన్నమయ్యకు ఐదేళ్ళు నిండాయి. అతడు ఏకసంతాగ్రాహి. గురువులు చెప్పిన పాఠాలు విన్నంతనే అప్పజెప్పేవాడు. వాళ్ళు చాలా ఆశ్చర్యపడేవారు. త్వరలోనే అన్నమయ్య అన్ని విద్యలనూ నేర్చుకున్నాడు.
అన్నమయ్య ఎప్పుడూ ఆటపాటల్లో మునిగితేలే వాడు. ప్రకృతితో తాదాత్మ్యం చెందేవాడు. చెరువు గట్లపై చేరి పక్షులతో గొంతు కలిపేవాడు. కలుపు పాటల్లో, కవుల పాటల్లో జానపదులతో పాటు శ్రుతి కలిపేవాడు. అన్నమయ్య మాటలకీ, పాటలకీ ఆ ఊరివారు ఎంతో సంబరపడేవారు.
ఒకసారి ఇంట్లో అందరూ అన్నమయ్య మీద విరుచుకు పడ్డారు. ”ఎప్పుడూ ఆటపాటల్లో గడిపే బదులు కాస్త పనీపాటా చూడొచ్చు కదా! అడవికెళ్ళి పశువులకి కాస్త గడ్డి కోసుకువచ్చి పడేయ్‌!” అంటూ తండ్రి నారాయణ సూరి కసిరాడు. అన్నమయ్య మౌనంగా కొడవలి భుజాన తగిలించుకొని అడవికి బయలుదేరాడు.
అన్నమయ్యకు అడవి కొత్త. ఒక చెట్టు కింద కూర్చున్నాడు. పక్కనే కొడవలి ఉంది. ఒకచోట పచ్చిక బాగా ఉంది. కొడవలితో కోస్తున్నాడు. అలవాటు లేని పని కదా! చిటికిన వ్రేలు తెగి రక్తం కారుతోంది. ”అమ్మా!” అని బాధతో మూలిగాడు అన్నమయ్య. అసలు ఈ అవస్థకు కారణం ఎవరు? ఒక్కసారి తన బంధువులు, తల్లిదండ్రులపై కోపం కలిగింది. ”అంతా భ్రమ! తనకు ఎవరూ లేరు” అనుకున్నాడు. దూరంగా తిరుపతికి వెళ్ళే యాత్రికుల బృందం కనిపించింది. వాళ్ళు ఆడుతూపాడుతూ వెళ్తున్నారు. వారిని చూడగానే ఉత్సాహంతో అన్నమయ్య పరుగున వెళ్ళి వారిలో కలిసిపోయాడు. గోవింద నామస్మరణం చేస్తూ వారితో తిరుపతి చేరాడు.
అదివో అల్లదివో!
తిరుపతి చేరుతూనే గంగమ్మ గుడికెళ్లాడు అన్నమయ్య. గ్రామశక్తికి దండం పెట్టాడు. అలిపిరి చేరాడు. అక్కడ నరసింహస్వామికి నమస్కరించాడు. అలిపిరి కొండ భగవంతుని చేరేందుకు తొలిపాదం. ఎత్తుగా విశాలంగా వ్యాపించి ఉన్న పర్వతశిఖరాలను చూసాడు. అవి ఆదిశేషుని పడగల్లా తోచాయి అన్నమయ్యకు. ఆనందంతో చిందులు త్రొక్కుతూ ”అదివో అల్లదివో శ్రీహరివాసము.. పదివేల శేషుల పడగల మయము” అంటూ పాడాడు.
అమ్మ దర్శనం
అన్నమయ్య కొండ ఎక్కుతున్నాడు. అతడింకా ఎనిమిదేళ్ళ పిల్లవాడే. ఉత్సాహంగా ఆ కొండ ఎక్కి మోకాళ్ళ పర్వతం చేరాడు. మిట్టమధ్యాహ్న మయ్యింది. అలసిపోయాడు. ఆకలిగా ఉంది. శోష వచ్చి అక్కడే పడిపోయాడు. అమ్మ అలమేలు మంగమ్మ కరుణించి అతడిని ఒడిలోకి తీసుకుంది. అన్నమయ్యకి మెలకువ వచ్చింది. అలమేలు మంగమ్మ ఆ పిల్లవాడికి ప్రసాదం తినిపించింది. అన్నమయ్యలో సరస్వతీదేవి అంశ ప్రవేశించింది. అన్నమయ్య ఆశువుగా ఒక శతకం చెప్పాడు. ఆ శతకంలో చంపక మాల, ఉత్పలమాల వృత్తాలున్నాయి. అంటే సంపెంగలు, కలువలు అన్నమాట. ‘అలమేలు మంగ’ అంటే పువ్వుమీద నిలచిన యువతి అని అర్థం. అందుకే అన్నమయ్య ఆ శతకాన్ని అమ్మకు అంకితమిచ్చాడు.
అక్కడి నుంచి అన్నమయ్య నేరుగా పుష్కరిణి వద్దకు వెళ్ళాడు. ఇది స్వామి పుష్కరిణి. ఈ పుష్కరిణిలో కొన్ని వేల పుణ్యనదుల నీళ్ళు కలుస్తాయి. అక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ పటాపంచలై పోతాయట. అన్నమయ్య ఆ పవిత్రజలాలలో స్నానం చేసాడు. అతడి బడలిక అంతా తీరిపోయింది. మనస్సు నిర్మలంగా ఉంది. వరాహ క్షేత్రమని పేరు బడిన తిరుమలలో అన్నమయ్య సాంప్రదాయం ప్రకారం మొదట ఆదివరాహస్వామిని సేవించి తరువాత వేంకటేశ్వరుని ఆలయంలో అడుగు పెట్టాడు. తన పంచె కొంగకున జాగ్రత్తగా దాచుకున్న ఒక కాసు తీసి వడ్డీకాసులవానికి సమర్పించుకున్నాడు.
అన్నమయ్య స్వామి సన్నిధిలోని బంగారు వాకిళ్ళ వద్ద నిలుచున్నాడు. శ్రీనివాసుని దర్శించాడు. అతని ఒళ్ళంతా పులకరించింది. రెప్ప వాల్చకుండా స్వామి వారినే చూస్తున్నాడు. శ్రీవేంకటేశ్వరుని దివ్య మంగళ స్వరూపాన్ని తిలకిస్తూ అలానే ఉండిపోయాడు. అన్నమయ్య హృదయం పారవశ్యంతో పొంగి పోయింది. అతని గొంతు నుండి మధురమైన భావ గీతికలు వెలువడుతున్నాయి. ”పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా ..” అంటూ తన్మయత్వంతో పాడాడు అన్నమయ్య. ఆ పాటకు ముగ్ధులైన అర్చకులు ఆ బాలుని దగ్గరకు తీసుకుని తీర్థప్రసాదాలిచ్చారు. అన్నమయ్య ఆ రోజు స్వామివారి మండపంలోనే విశ్రమించాడు.
మరునాడు ఏకాదశి. కొండమీదనున్న దివ్య తీర్థాలను చూడడానికి వెళ్ళాడు అన్నమయ్య. ఆకాశ గంగ చూసాడు. అక్కడే అంజనాదేవి పన్నెండేళ్ళు తపస్సు చేసి హనుమంతుని కన్నది. తరువాత పాపవినాశని జలపాతంలో స్నానం చేసాడు. ఈ తీర్థాలలో స్నానంచేస్తూ అన్నమయ్య ఒక గమ్మత్తు చేసేవాడు. అదేమిటంటే స్నానం చేసేక ఆరేసిన తన బట్టతడి ఆరేలోపు ఒక శతకాన్ని ఆశువుగా చెప్పేవాడు.
అన్నమాచార్య..
ఆ రోజుల్లో ఘనవిష్ణువు అనే వైష్ణవ యతి తిరుమలలో ఉండేవాడు. అతడు మహాభక్తుడు. మాధవసేవ చేస్తూ సాటి మానవులకు విష్ణుతత్వాన్ని బోధించేవాడు. శేష జీవితాన్ని స్వామికే అంకితం చేసాడు. ఆరోజు ద్వాదశి. ఆ రాత్రి వేంకటేశ్వరుడు ఆ యతి కలలో కనిపించి, ”తాళ్ళపాక అన్నమయ్య అనే భక్తుడు రేపు నీ వద్దకు వస్తాడు. ఎప్పుడూ నా మీద పాటలు పాడుతూ ఉంటాడు. వానికి నీవు ముద్రధారణ చేయి. ఇవిగో నా ముద్రికలు” అని ముద్రికలు అందించాడు.
మరునాడు ఉదయాన్నే స్నానసంధ్యాదులు ముగించుకుని ఘనవిష్ణువు స్వామి మందిరంలో యజ్ఞశాల వద్ద నిల్చున్నాడు. అతని చేతులలో స్వామి ప్రసాదించిన శంఖచక్రాల ముద్రలున్నాయి. అన్నమయ్య ఉదయాన్నే పుష్కరిణిలో స్నానం చేసి హరినామ సంకీర్తన చేసుకుంటూ యజ్ఞశాల ముందుకు వచ్చాడు. ఘనవిష్ణువు ఆ బాలుని చూసాడు. వానిలో స్వామి చెప్పిన పోలిలు గమనించి మెల్లగా ఆ బాలుని సమీపించాడు. అతడు అన్నమయ్యేనని నిర్ధారించుకున్నాడు. ఘనవిష్ణువు ఆ బాలునికి వేదోక్తంగా పంచసంస్కారాలు నిర్వహించాడు. ఇప్పుడా బాలుడు అన్నమాచార్యుడు.
కుమారుని వెదుకుతూ..
అన్నమయ్య చెప్పాచెయ్యకుండా తిరుమతి వెళ్ళిపోయాడు. ఇక్కడ తాళ్ళపాకలో తల్లిదండ్రులు కుమారుని కోసం వెదకి వెదకి కనబడక క్రుంగి పోయారు. తల్లి లక్కమాంబ చెన్నకేశవుని గుడివద్దనే ఉండిపోయింది రోధిస్తూ. తండ్రి వెఱ్ఱివాడిలా అయిపోయాడు. ఆ రోజు ద్వాదశి. ఊరివాళ్ళంతా అన్నమయ్య కోసం దేవుడికి ప్రత్యేక పూజలు చేసారు. లక్కమాంబ భజనచేస్తూనే స్పృహతప్పి పడిపోయింది. అలా స్పృహలో లేకుండానే, ”తిరుమలప్ప.. అన్న మయ్యా” అంటూ గొణుగుతోంది. అది తండ్రి నారాయణయ్య విన్నాడు. అతడికి ఏదో స్ఫురించింది. మరునాడు లక్కమాంబను తీసుకుని తిరుమలకు బయలుదేరాడు.
ఆ రోజు అన్నమాచార్యుడు దేవాలయ మండపంలో కూర్చుని తన్మయత్వంతో గానం చేస్తున్నాడు. ఎందరో భక్తులు పారవశ్యంతో వింటు న్నారు. తిరుమల చేరిన లక్కమాంబ, నారాయణసూరి కుమారుని కంఠం గుర్తుపట్టారు. వారి సంతోషానికి అవధుల్లేవు. తల్లి ”నాన్నా” అంటూ కుమారునివైపు పరుగులు తీసింది. అమ్మ పిలుపు విన్న అన్నమా చార్యుని గానం ఆగిపోయింది. ”అమ్మా” అంటూ తల్లి ఒడిలో వాలిపోయాడు. తండ్రి ఆనందంగా, గర్వంగా కుమారుని దగ్గరకి తీసు కున్నాడు. అతనిలో మార్పుని గమనించి, ”స్వామీ! వేంకటేశ్వరా! వీడు నీ వరప్రసాదం. నీవే కాపాడుకో!” అన్నాడు.
ఆ రాత్రి లక్కమాంబ తమతో ఊరికి రమ్మని కుమారుని అడిగింది. కానీ తనకి ఇక్కడే బావుంద న్నాడు అన్నమాచార్య. ఆ రాత్రి అన్నమయ్యకు కలలో ఒక తేజస్సు కనిపించి, ”నాయనా! తల్లి మనసు కష్టపెట్టకు. తాళ్ళపాకకు తిరిగి వెళ్ళు. నీకు సకల శుభాలు సమకూరుతాయి” అని ప్రబోధించింది. అది స్వామి ఆదేశంగా తలచి అన్నమాచార్యుడు తల్లి దండ్రులతో కలిసి తాళ్ళపాకకు తిరిగి వెళ్ళాడు.
గృహస్థాశ్రమం
అన్నమాచార్యునికి పదహారేళ్ళు నిండాయి. తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు చేయసాగారు. భగవత్సంకల్పం వల్ల అన్నమాచార్యుడు తిమ్మక్క, అక్కలమ్మ అనే ఇద్దరు కన్నెలను వివాహమాడి గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టాడు.
స్వామి దర్శనం
అది క్రీ.శ.1424 క్రోధినామ సంవత్సరం. వైశాఖ మాసం, విశాఖ నక్షత్రం. అన్నమాచార్యుడు పుట్టిన రోజు. అన్నమయ్య తిరుమలకు వెళ్ళాడు. స్వామిని దర్శించుకున్నాడు. ఆ రాత్రి వరాహస్వామి గుడి వద్ద ఉన్న మండపంలో విశ్రమించాడు. ఎంతసేపటికీ నిద్ర పట్టడంలేదు. వెంటనే తంబుర తీగలు సవరించాడు. ఏదో రాగమందుకున్నాడు. అతడికేదో విచిత్రమైన అనుభూతి కలుగుతోంది. హృదయంలో అలజడి ప్రారంభమైంది. హఠాత్తుగా అతడి నుండి ఒక కొత్త పాట వెలువడింది. అదే ”బ్రహ్మ కడిగిన పాదము”.
భావసముద్రంలో ఓలలాడుతున్న అన్నమా చార్యునికి వేంకటేశ్వరస్వామి సాక్షాత్కరించాడు. అన్నమాచార్యుడు స్వామి పాదాలపై వాలిపోయాడు. ”ఆచార్యా! నీవు ధన్యుడవు. నీ నోట సంకీర్తనం అవతరించింది. నీవు పదకవితా పితామహుడవు. ఈనాటి నుండి సంకీర్తన యజ్ఞం నిర్వహించు. రోజూ కనీసం ఒక పాటైనా నీ నోట వినాలి. నీ సంకీర్తనలు తప్ప మరెవ్వరివీ వినను. ఇది నా ప్రతిజ్ఞ. ఇదే నీ వ్రతం” అని వేంకటేశ్వరస్వామి ఆనతిచ్చి అదృశ్య మయ్యాడు.
దేశ సంచారం
అన్నమాచార్యుడు స్వామి ఆదేశం పాటిస్తూ సంకీర్తన యజ్ఞం నిర్వహించాడు. ఊరు వాడ తిరుగుతూ పాటలు పాడేవాడు. ఆ పాటలలోని తేటతెలుగు మాటలకు ప్రజలంతా మురిసిపోయే వారు. ఆ మాటలలోని అర్థాలు తెలుసుకొని భక్తి పారవశ్యంతో పొంగిపోయేవారు.
తందనానా భళా తందనానా..
శఠకోపయతి గొప్ప తపస్సంపన్నుడు. అహోబిలంలో వెలసిన నరసింహస్వామి యతి రూపంలో ప్రత్యక్షమై ఈ శఠకోపయతులకు సన్యాసాశ్రమం అనుగ్రహించారట. వారి గొప్పతనం గూర్చి విన్న అన్నమాచార్యులు అ¬బిలం వెళ్ళాడు. అ¬బిలం క్షేత్రం నల్లమల అడవులలో ఏర్పడింది. ఈ అడవి చిరుతపులులకు, సింహాలకు ప్రసిద్ధి. ఈ అడవులలో అన్నమాచార్యులు నిర్భయంగా నడచి వెళ్ళాడు. అ¬బిల నరసింహుని స్తుతిస్తూ ఎన్నో పాటలు పాడాడు. భవనాశినీ నది ఒడ్డున ఒక మండపంలో శఠకోపయతి కూర్చున్నారు. అన్నమాచార్యులు ఆయన పాదాలపై వాలాడు. ఆనందంతో ఆయనని స్తుతించాడు. ఆ యతి వద్ద పన్నెండేళ్ళు శుశ్రూష చేసాడు. వైష్ణవ ఆగమాలన్నీ నేర్చుకున్నాడు. విష్ణుతత్త్వాన్ని గురించి ఇలా తెలుసుకున్నాడు : ”విష్ణువు దయామయుడు. సకల ప్రాణులు విష్ణువుని చేరడానికి అర్హులు. జాతితో కాని, మతంతో కాని, వర్ణంతో కాని, వర్గంతో కాని పనిలేదు. శరణాగతి మంత్రం పఠిస్తే చాలు, భగవంతుడు వశుడౌతాడు”. శఠకోపయతి బోధనలు అన్నమాచార్యుని ఆకట్టు కున్నాయి. ఆ ప్రబోధాలను వినిపిస్తూ ”తందనానా అహి తందనానా పురే తందనానా భళా తందనానా” అంటూ పాడాడు. మానవజాతి కల్యాణం కోసం వైష్ణవతత్త్వాన్ని అన్నమాచార్యుడు మధురమైన పాటల ద్వారా ప్రచారం చేయసాగాడు. ఆయన సంకీర్తనలు దేశవ్యాప్తం అయ్యాయి.
సాళ్వ నరసింగరాయలకు గురుత్వం
టంగుటూరును పాలించే సాళ్వ నరసింగరాయలు అన్నమాచార్యుని గొప్పదనం విన్నాడు. అన్నమాచార్యుని దర్శించడానికి ధన, కనక, వస్తు, వాహనాలతో తాళ్ళపాక వెళ్ళాడు.
సాళ్వ నరసింహరాయలు తాళ్ళపాకకు సమీపంలో ఉన్న టంగుటూరులో దండనాథుడుగా ఉండేవాడు. అతడు మహావీరుడు. ‘సాళ్వ’ అతడి బిరుదు. అతడు అన్నమాచార్యుని తన గురువుగా భావించేవాడు. అన్నమాచార్యుని అనుమతి లేకుండా ఏ పనీ చేసేవాడు కాడు. గురువు ఆశీర్వచనం వల్ల, తన పరాక్రమం వల్ల నరసింగరాయలు పెనుగొండ రాజ్యానికి ప్రభువయ్యాడు. అన్నమాచార్యుని తన ఆస్థానానికి ఆహ్వానించి సన్మానించాడు. తనకు మార్గదర్శనం చేస్తూ తోడుగా అన్నమయ్యను అక్కడే ఉండమని ప్రార్థించాడు. తన భగవత్సంకీర్తనకు ఆటంకం కానంతవరకు అక్కడే ఉంటానని అన్నమాచార్యుడు సమాధానమిచ్చాడు. రాజు అన్నమాచార్యునికి సకల సదుపాయాలను సమ కూర్చాడు. అన్నమయ్య దేవాలయాలను కేంద్రాలుగా చేసుకొని సంకీర్తనల ద్వారా విశిష్టాద్వైతాన్ని వ్యాప్తి చేయసాగాడు.
ఒకసారి నరసింగరాయుని ఆస్థానంలో అన్నమయ్య ”ఏమొకో చిగురుటధరమున యెడనెడ కస్తూరి నిండెను” అంటూ మధురమైన శృంగార పదాన్ని పాడాడు. అది విని పరవశించిన నరసింగరాయుడు తనపై కూడా అటువంటి గీతాన్ని పాడమని కోరాడు. అది విని హరిభక్తుడైన అన్నమాచార్యుడు గట్టిగా చెవులు మూసుకున్నాడు. ఆసనం నుండి దిగ్గున లేచి, ”రాజా! ఎంత నీచమైన కోరిక కోరావు? హరిని గురించి పొగిడే ఈ నాలుకతో ఇతరులను ఎలా స్తుతించేది? నీకు, నీ కొలువుకు ఇక సెలవు” అంటూ సభ నుండి నిష్క్రమించాడు. అలా సభలో పదిమంది ముందూ తిరస్కారానికి గురికావడం రాజుకు తల తీసేసినట్లయ్యింది. అన్నమాచార్యుని చెరసాలలో వేయించాడు. అన్నమయ్య కాళ్ళకు, చేతులకు సంకెళ్ళు వేయించాడు. అన్నమాచార్యులు వేంకటేశ్వరుని వేడుకొంటూ ”నీ దాసుల భంగములు నీవు చూతురా” అంటూ పాడాడు. అన్నమయ్య పాట ముగించగానే అతని కాళ్ళకూ, చేతులకూ వేసిన సంకెళ్ళు తెగి నేలపై పడ్డాయి. అది చూసి ఆశ్చర్యపోయిన భటులు పరుగున వెళ్ళి రాజుకు విషయం తెలిపారు. రాజు ఆచార్యుని వద్దకు వచ్చి ”నేను నమ్మను. ఈసారి సంకెళ్ళు మరింత గట్టిగా బిగించండి” అని భటులను హెచ్చరించాడు. అంతటితో ఆగక, ”ఏమయ్యా! ఈసారి పాటలు పాడి సంకెళ్ళు తెంచుకో చూద్దాం” అని ఎగతాళి చేసాడు. ఆ మహాభక్తుడు రాజు అజ్ఞానానికి నవ్వుకుని వేంకటేశ్వరుని కీర్తిస్తూ పాట పాడాడు. రాజు కళ్ళ ఎదుటే అన్నమయ్య సంకెళ్ళు తెగి కింద పడిపోయాయి. రాజు తన తప్పు తెలుసుకున్నాడు. ఆచార్యుని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. అతడిని క్షమిస్తూ అన్నమయ్య, ”రాజా! ఎప్పుడూ హరి భక్తులను బాధపెట్టవద్దు. భాగవతులను అవమానించడం భగవంతుని అవమానించడం కంటే తీవ్రమైనది. కలియుగంలో భగవంతుడు సంకీర్తనలతోనే తృప్తిపడతాడు. రాజు విష్ణువుతో సమానం. నీవు ధర్మరక్షణ గావించు” అన్నాడు.
తరువాత అన్నమాచార్యుడు రాజాశ్రయాన్ని వీడి తిరుమల క్షేత్రానికి తరలి వెళ్ళాడు.
తిరుమలలో
అన్నమాచార్యుడు తిరుమల క్షేత్రం చేరుకున్నాడు. తన జీవితమంతా ఆ స్వామి సన్నిధిలోనే గడుపు తున్నాడు. స్వామి ఉత్సవాలలో, ఊరేగింపులలో పాల్గొని ఎన్నో పాటలు పాడేవాడు. సుప్రభాత సేవ మొదలుకొని ఏకాంతసేవ దాకా స్వామికి ఎన్నో పాటలు పాడి వినిపించేవాడు. ”శృంగారమంజరి” అనే ద్విపదకావ్యం వ్రాసాడు. అన్నమయ్య పాటలను శ్రీనివాసుడు ప్రత్యక్షంగా వినేవాడట!
అన్నమాచార్యుడు మహాభక్తుడు. అతని నోటివెంట వచ్చిన మాట అక్షరాలా జరిగి తీరేది. ఆయనది నిర్మలమైన మనస్సు. ఆయనది లోక కల్యాణ దృష్టి. ఆయన సంకీర్తన యజ్ఞమే చేసాడు. ఆ కీర్తనలు కేవలం పాటలు కావు. అవి వేంకటేశ్వర స్వామి దివ్య మంత్రాలు.
అవతార సమాప్తి
అన్నమాచార్యులు క్రీ.శ. 1503లో నిర్యాణం చెందారు. అప్పటికి ఆయన వయస్సు 95 సంవత్సరాలు. అది దుందుభి నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి. తన కుమారుడు పెద తిరుమలయ్యను పిలిచి మెల్లగా ”నాయనా! నేటితో నా సంకీర్తన యజ్ఞం సమాప్తమౌతున్నది. ఇకనుంచి దినమునకు ఒక్క సంకీర్తన తక్కువ కాకుండా శ్రీనివాసునికి అర్పించే బాధ్యత నీది. ఈ యజ్ఞం నీవే కొనసాగించాలి” అంటూ కుమారుని చేతికి తంబుర, చిరుతలు అందించాడు. తరువాత అన్నమాచార్యుడు గంభీరంగా అడుగులు వేసుకుంటూ తిరుమల మందిరంలో కలిసిపోయాడు.
అన్నమాచార్యుని రచనలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. వీరి రచనలను రాగి రేకులమీద కూడా వ్రాయించారు. కాని మన అశ్రద్ధ, అవివేకం వల్ల వాటిలో కొన్ని వేల రేకులను పోగొట్టుకున్నాం. రాగం విలువ తెలియని జాతి రాగి కోసం వాటిని కరిగించుకొంది.
అన్నమాచార్యులు 32 వేల సంకీర్తనలు వ్రాస్తే వాటిలో 12 వేలు మాత్రమే దొరికాయి. లభ్యమైనవి తిరుమల దేవాలయంలో సంకీర్తన భాండారంలో భద్రపరిచారు. ఇంకా వారు వ్రాసిన ద్విపద రామాయణం, వేంకటాచల మహాత్మ్యం, సంకీర్తన లక్షణం, ఎన్నో భాషల్లో వ్రాసిన ప్రబంధాలు మనం పోగొట్టుకున్నాం.

No comments:

Post a Comment