అన్నమయ్య వేంకటేశ్వరుని మేలుకొలుపు కీర్తన
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
(పన్నగము = పాము. ఇక్కడ, "పన్నగపు దోమతెర" అంటే, ఆదిశేషుడు విడిచిన పూసము యొక్క తెర ఏమో?)
తెల్లవారె జామెక్కె దేవతలు మునులు
అల్లనల్ల నంతనింత నదిగోవారే
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా
(తమ్మి రేకులు = పద్మము యొక్క రేకులు, సారసము = పద్మము)
గరుడ కిన్నర యక్ష కామినులు గములై
విరహపు గీతముల వింతాలాపాల
పరిపరివిధముల బాడేరునిన్నదివో
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా
పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు
పంకజభవాదులు నీ పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా
(పొంకపు = సొగసైన, పంకజభవాదులు = పద్మము నందు జన్మించిన బ్రహ్మ మొదలైనవారు, అంకెలనున్నారు = బారు తీరి వున్నారు?)
ఇది స్వామికి మేలుకొలుపు. ఇది సకల చరాచర సృష్టికే మేలుకొలుపు. మనకే కాదు - భగవంతునికి కూడ దోమతెర కట్టుకొనుట తప్పలేదు. ఆది శేషుడున్నంతవరకు స్వామికి ఏ కొరత లేదు. అవతారములెత్తుటలో శేషుడు తన ప్రభువునకు ఏమీ తీసిపోవువాడు కాదు. 'ఆది శేశుడు శ్రీ మహావిష్ణువునకు పలు విధములగు భోగోప కరణములుగా సేవ చేయు ' నని యమునాచార్యులవారు ఆనతిచ్చినారు. వారు 'వారణాదిభిః ' అనుట మేలైనది. అన్నమయ్య పన్నగమును దోమతెరగ కూడ భావించినాడు. అతనిదొక విలక్షణమైన భావచిత్రణ.
అందరి విన్నపాలు వినవలెనని మేలుకొను మని అన్నమయ్య తన విన్నపాలనే స్వామికి తొలుత వినిపించినాడు. భక్త పరాధీనుడైన భగవంతునకు వినక తప్పలేదు.
అదిగో - తెల తెలవారినది. ప్రొద్దు జామెక్కినది. ముక్కోటి దేవతలు, మునులు - అరుగో అంతలంతల నిలచినారు. మెల్ల మెల్లగా నీ కన్నుందామరలు విచ్చి చల్లని చూపులు వారిపై చల్లవయ్యా !
అవిగో - క్రొత్త క్రొత్త రాగాలాపనలు నీకు వినిపించుట లేదా ? అవి గుంపులు గుంపులుగ నీ యొద్ద చరిన గరుడ కిన్నెర యక్ష కామినుల విరహ గీతములు. నీ ప్రణయ దృక్కులతో వారి కోరికలు తీర్చుము. దోమతెర తోల్గించి, సిరులు చిందే నీ ముఖమును చూపుము. ఆ హరిణేక్షణల చిత్తములను తెలిపే పాటలను చిత్తగించవయ్యా !
అరుగో (దోమ తెర యైన) శేషుడు, తుంబురు నారదాదులు. బ్రహ్మ - అందరు నీ పాదాల సన్నిధిలోనే నిలచి యున్నారు. తొంగలి రెప్పలు విచ్చి నీ తొలి చూపు కలిమికలికిపై నిలుపవయ్య ! జగన్మంగళ - అలమేలుమంగను చూడవయ్యా !
ఈ వింత వింత విన్నపములు విని సిరిమగడు ముసి ముసి నగవులతో నిద్ర లేచియే ఉండును.
(శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ మరియు శ్రీ కామిశెట్టి శ్రీనివాసు గార్ల వివరణ)
భావయామి గోపాలబాలం
భావయామి గోపాలబాలం
మన-స్సేవితం తత్పదం చింతయేయం సదా IIపల్లవిll
కటిఘటితమేఖలాఖచితమణిఘంటికా-
పటలనినదేన విభ్రాజమానం
కుటిలపదఘటితసంకుల శింజితే నతం
చటులనటనాసముజ్జ్వలవిలాసం. IIభావII
నిరతకర కలితనవనీతం బ్రహ్మాది-
సురనికరభావనా శోభితపదం
తిరువేంకటాచలస్థిత మనుపమం హరిం
పరమపురుషం గోపాలబాలం. ||భావII
అన్నమయ్య సంకీర్తనలలో సాధారణంగా మూడేసి చరణాలు ఉంటాయి. కాని ఈ సంకీర్తనలో మాత్రం రెండు చరణాలు మాత్రమే ఉన్నాయెందుచేతనో. ఇది సంస్కృతభాషలో రచింపబడిన సంకీర్తన. అర్థం చేసుకొనే ప్రయత్నం చేద్దాం. నాకు సంస్కృతభాషా పరిచయం బాగా తక్కువ. అయినా ఎలానో అలా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. తప్పులను – పెద్దలు, తెలిసినవారూ- తెలియజేస్తే కృతజ్ఞుడిని.
భావయామి=భావించుచున్నాను
గోపాలబాలం=బాలునిరూపంలో ఉన్న గోపాలుని
సదా=ఎల్లప్పుడూ
మనస్సేవితం=మనస్సుతో సేవించబడుచున్న
తత్ పదం=ఆ గోపాలబాలుని పదములను
చింతయ ఇయం=నేను చింతనచేస్తున్నాను
చింతయే2హమ్ కావచ్చునేమో అని ఫుట్ నోట్సులో వ్రాసి ఉంది. నేను చింతిస్తున్నాను అని అర్థం.
కటి=నడుము భాగమునందు
ఘటిత=ఉంచబడిన
మేఖలా=వడ్డాణముయందు
ఖచితమణిఘంటికా=తాపడము చేయబడ్డ మణులఘంటలయొక్క
పటల=సమూహము
విభ్రాజమానం=ప్రకాశితమగుచున్నది.
కుటిలపదఘటిత=వంకరగానున్నపదములయందుంచబడిన
శింజితే నతం=మువ్వలచప్పుడు(?), శింజితానతం అని ఉండవచ్చేమో అంటూ ఏమైనా అర్థమంత సరిగా దోపదు అని అథోసూచికలో సూచించారు.
చటులనటనా=నటనలతో చలించున్న
సముజ్జ్వలవిలాసం=సముజ్జ్వలమైన విలాసముతో కూడుకున్నది
నిరత=మిక్కిలి ఆసక్తికొన్న
కరకలిత=అరచేతియందలి
నవనీతం=వెన్నపూస
బ్రహ్మాదిసురనికరభావనా శోభితపదం =బ్రహ్మదేవుడు మొదలుగాగల దేవతల సమూహము చేత భావింపబడిన అందమైన పదములు
తిరువేంకటాచలస్థితమ్=శ్రీవేంకటాచలపర్వతమందున్న
అనుపమం హరిం=చక్కనివాడైన శ్రీహరిని
పరమపురుషం=పరమపురుషుడైన
గోపాలబాలం=గోపాలబాలునిని
భావయామి=భావించుచున్నాను.
I meditate upon the Baby Gopala, Who is served by my mind. I always meditate on those feet.||1||
I meditate upon the Baby Gopala, Who is glittering forth due to immense rhyming sound coming from jewel and bell studded waist girdle, and Who is shining forth trembling dances adorned by the sound of feet running in curved trajectories.||2||
I meditate upon the Baby Gopala, Who is engrossed in the beautiful new butter-ball in His hand, Whose feet are adorned by the various devoted emotions of Brahma and demi-gods, Who is situated at the mountain of Tirupati¹ as Venkat, Who is without a comparison, Who is Hari, and Who is the best person.||3||
No comments:
Post a Comment