-->

Saturday, November 21, 2015

శ్రీవారి మహత్యం

అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు కొలువై వున్న సప్తగిరుల పుణ్య క్షేత్రము తిరుమల. నిత్యమూ స్వామి వారి నామ స్మరణతో పునీతమైన పవిత్ర ప్రదేశం తిరుమల. చూడ వేయి కన్నులు చాలని బ్రహ్మోత్సవం అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడుకి బ్రహ్మోత్సవం అంటూ జరిగే ఉత్సవాలతో, ఊరేగింపులతో, ఆటపాటలతో, కోలాటాలతో, శ్రీ వారి స్తోత్రాలతో, భక్తి పాటలతో , కీర్తనలతో అలరారుతూ, ప్రతిరోజూ లక్షలాది భక్తులకు దర్శన భాగ్యమును ప్రసాదిస్తూ, కోట్లాది భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తున్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై వున్న ఇల వైకుంఠము తిరుమల, మన రాష్ట్రములో ఉండడము మన అదృష్టము, మహద్భాగ్యము.
దివ్యమైనటువంటి, పవిత్రమైనటువంటి, భూతల స్వర్గము అయిన తిరుమల పుణ్య క్షేత్రము శేషాచల పర్వత ప్రాంతములో నిలయమై ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధి వేంకటాద్రి శిఖరము పైన నిలయమై ఉన్నది. పర్వతశ్రేణులన్నీ శ్రీ మహా విష్ణువు యొక్క క్రీడా పర్వతాలు అనీ, వైకుంఠము నుండి వాటిని తెచ్చి స్వర్ణ ముఖి నదీ తీరంలో ప్రతిష్ట చేసారని, ఏడుకొండలపై వున్న ప్రతి శిలా చింతామణి అని, ప్రతీ చెట్టు, ప్రతీ తీగ మహర్షులని, ప్రతీ తీర్థము దేవ గంగా స్వరూపాలని శ్రీ వేంకటాచల మహత్యంలో చెప్పబడినది.
కలియుగ ప్రత్యక్ష దైవం  ఏడుకొండల స్వామి.. స్వామి సన్నిధిలో ఎంతో అలౌకికానందం ఉంటుంది..ఏడుకొండలకు చేరుకుంటే ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మనస్సులోని ఆందోళన దూరమవుతుంది. మధుర భక్తిభావన మనస్సంతా నిండిపోతుంది. ఆపద మొక్కుల వాడు..శ్రీనివాసుడు..అందరినీ కాపాడే దేవుడు. అందుకే నిత్యం తిరుమల గిరులు గోవిందా...గోవిందా...అని మార్మోగుతుంటాయి. ఎండైనా...వానైనా...ఏకాలమైనా..ఏడుకొండలనిండా భక్తజనం కనిపిస్తుంది. శ్రీవారి దివ్యదర్శనానికి పరితపిస్తుంది. దానికి తరతరాలుగా భక్తజనుల నమ్మకాలు..స్వామి ఇచ్చిన వరాలు..భక్తిలోకాన్ని పరవశింపజేస్తున్నాయి. కొన్ని వందలేళ్లుగా శ్రీనివాసుడి కరణా కటాక్షాలపై ఎన్నో కథలు...కథనాలు వినిపిస్తున్నాయి. కలియుగంలో స్వామి భక్తులకు ఎన్నో అపూర్వ భక్తివరాలు లభిస్తున్నాయన్న నమ్మకాలు నిత్యం కనిపిస్తున్నాయి
 
కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడి మహిమలు ఇప్పటిదాకా ప్రత్యక్షంగా కనిపించకపోయినా...పరోక్షంగా ఎన్నో ఉన్నాయి. శ్రీవారి కొండపైకి కాలినడక నియమ నిష్టలతో దర్శనానికి వెళ్లే భక్తులకు కొద్ది దూరం నడవగానే...ఏడు కొండలు ఎక్క గలమా..? అనే సందేహం వస్తుంది...కానీ..వెనుకడుగు పడదు. సందేహంతో ముందుకుసాగిన నడక మరికొంత దూరం వెళ్లేసరికి అలసట లేని భక్తి నడకగా మారుతుంది. ఏడుకొండలు ఏడు మెట్లుగా మారిపోతాయి. ఓపిక ఉన్నా లేకున్నా...భక్తజనం కొండకు సులువుగాచేరుకోవడం అంతా స్వామి మహిమే. ఇది నిత్యం జరిగే పరోక్ష మహత్యం. అలాగే ఏడు కొండల స్వామిని నమ్ముకుంటే ఎన్ని కష్టాలైనా తొలగుతాయి. తనకు భక్తిపూర్వకంగా సేవలందించే వారికి ఎలాంటి కష్టం కలిగించడనే దానికి కొన్ని నిదర్శనాలున్నాయి. ఏడుకొండల్ని కబళించడానికి అనాదిగా ఎత్తులు వేసినవారు చరిత్ర గతిలో కలిసిపోయారు. ముస్లిం రాజుల దండయాత్రల్లో ఎన్నో ఆలయాలు ధ్వంసమైనా తిరుమల జోలికి ఎవరూ వెళ్లలేదంటే అంతా శ్రీనివాసుని మహిమేనని కథలున్నాయి. ఇవే కాదు నిత్యం స్వామి సన్నిధిలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎంతో ఆశతో ఒక్కసారి ఏడుకొండల స్వామిని కనులారా వీక్షించగానే ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్వామిరూపం అద్భుతంగా ఉంటుంది. మళ్లీ...మళ్లీ దర్శనం చేసుకోవాలన్న ఆరాటం కలుగుతుంది. కలియుగ దైవం వెంకన్న మహత్యం ఎన్ని యుగాలు చెప్పుకున్నా తరిగిపోనిది...సూర్యచంద్రులున్నంత కాలం శ్రీవేంకటేశ్వర మహత్యం విలసిల్లుతుంది. 
తిరుమల లో ఉండే ఏడుకొండలనే సప్తగిరులని కూడ అంటారు. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ... శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషబాధ్రి, నారాయణాద్రి మరియు వేంకటాద్రి. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమల గిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర. ఏడుకొండలు సప్తగిరులు అవి వేంకటాద్రి--వృషభాద్రి--గరుడాద్రి--నారాయణాద్రి--అంజనాద్రి--నీలాద్రి--శేషాద్రి.

No comments:

Post a Comment